![]() |
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఊహించడం చాలా కష్టం. ఒక భాషలో ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్‌బస్టర్ స్టోరీ.. మరో భాషలోకి రీమేక్ అయినప్పుడు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో, ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక విలక్షణమైన సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ చిత్రసీమలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న భారతీరాజా 1986లో ‘కడలోర కవితైగల్’ అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. అప్పటివరకు కేవలం నెగటివ్, విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు సత్యరాజ్‌ను ఈ సినిమాతో లీడ్ హీరోగా మార్చారు. బాధ్యత లేకుండా తిరిగే ఒక ఊరి రౌడీకి, స్కూల్ టీచర్‌కు మధ్య సాగే ఈ ప్రేమకథ తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇళయరాజా అందించిన సంగీతం అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఈ ఒక్క సినిమాతో సత్యరాజ్ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయారు.
తమిళంలో ఈ సినిమా సాధించిన ఘనవిజయాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఎలాగైనా దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఆశపడ్డారు. అనుకున్నదే తడవుగా అల్లు అరవింద్‌ను రంగంలోకి దించి, ఒరిజినల్ డైరెక్టర్ భారతీరాజాతోనే తెలుగు వెర్షన్‌ను కూడా ప్లాన్ చేశారు. అలా చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా ‘ఆరాధన’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ కథ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణం.. తమిళ వెర్షన్లో ఉన్న ఫ్లేవర్‌ను మార్చకుండా యథాతథంగా తెలుగులో దించడమే. పైగా అప్పట్లోనే ‘ఖైదీ’, ‘దొంగమొగుడు’ వంటి మాస్ యాక్షన్ సినిమాలతో సుప్రీమ్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవిని, ఒక విభిన్నమైన సాఫ్ట్ మరియు రౌడీ రోల్లో చూడటానికి తెలుగు ఆడియన్స్ అస్సలు ఇష్టపడలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ పరాజయాన్ని చవిచూసింది. కానీ ఈ సినిమాలోని ‘అరె ఏమైంది’ వంటి పాటలు మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవి కోపంగా చూస్తున్న ఒక నిలువెత్తు ఫోటో ఉంటుంది. అది ఈ ‘ఆరాధన’ సినిమాలోని ‘పులిరాజు’ క్యారెక్టర్‌కు సంబంధించినదే కావడం విశేషం. సినిమా ప్లాప్ అయినా కూడా మెగాస్టార్ ఫిల్మోగ్రఫీలో ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా ఈ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నటుడిగా కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి చిరు చేసిన ఈ సాహసం ఇప్పటి జనరేషన్ మేకర్స్‌కు కూడా ఎంతో స్పూర్తిని ఇస్తోంది.
![]() |